హైదరాబాద్ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే లే ఆఫ్ కాకుండా బొగ్గు గనుల్లో లాక్‌డౌన్ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీకి గురువారం నోటీస్ ఇచ్చారు.
నోటీస్‌లోని ముఖ్యాంశాలు ‘కరోనా వైరస్ వలన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులు అందరికీ పూర్తి జీతంతో కూడిన లాక్‌డౌన్ ప్రకటిస్తే, డీజీఎమ్‌ఎస్ నోటీసు ఇచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం లాక్ డౌన్ చేయాలి తప్ప లే ఆఫ్ చేయకూడదు. రాష్ట్ర బడ్జెట్‌లో డబ్బు లేనందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించారు. దీనికి సింగరేణికి సంబంధం లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బుల నుండే చెల్లిస్తుంది.